కొత్త కేలండర్ 2025 ఎప్పుడు ప్రకటిస్తారు ?
తెలుగు అకాడమీ పుస్తకాలపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వదా ?
తెలంగాణలో కొత్తగా జాబ్ నోటిఫికేషన్లు ఎప్పుడు ఇస్తారన్న దానిపై క్లారిటీ లేకుండా పోయింది. అసెంబ్లీలో ప్రకటించిన జాబ్ కేలండర్ ప్రకారం గత అక్టోబర్ లోనే గ్రూప్ 1 ప్రిలిమ్స్ కోసం కొత్త నోటిఫికేషన్ రిలీజ్ కావాలి. అలాగే ప్రభుత్వ ఇంజినీరింగ్ విభాగాల్లో AEE, ఇతర గెజిటెడ్ హోదా సర్వీసులకు నోటిఫికేషన్ ఇవ్వాలి. ఇంకా విద్యుత్ సంస్థల్లో లైన్ మెన్లు, AEEలు, AEలు, సబ్ ఇంజినీర్లు, ఇతర పోస్టులకు అక్టోబర్ లోనే నోటిఫికేషన్ రావాలి… ఈ నవంబర్ నెలాఖరుకు వస్తుందని అంటున్నారు. అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ నోటిఫికేషన్ కూడా రావాలి. ఇవన్నీ రావాల్సిన నోటిఫికేషన్లు… ఇంకా జాబ్ కేలండర్ షెడ్యూల్ ప్రకారం 2024 డిసెంబర్ లో నోటిషికేషన్లు ఏమీ లేవు. 2025 జనవరిలో కొత్త డీఎస్సీ, ఇంకా కొన్ని నోటిఫికేషన్లు రావాలి.
Read this also : Semi Conductors Jobs : 10 లక్షల కొలువుల్లో మీకూ ఒకటి
కానీ
రాష్ట్రంలో SC వర్గీకరణ ప్రక్రియ పూర్తయ్యాక మాత్రమే… కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. దాంతో జాబ్స్ రిక్రూట్ మెంట్ ప్రాసెస్ ఆగిపోయింది. SC వర్గీకరణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన షమీమ్ అక్తర్ కమిషన్ నివేదిక ఇవ్వడానికి 2025 జనవరి 11 వరకు గడువు ఉంది. ఆలోగా ఖచ్చితంగా నివేదిక వస్తుందా… రాకపోతే ప్రభుత్వం మళ్ళీ extension ఇస్తే పరిస్థితి ఏంటి ? మళ్లీ అది రాష్ట్రపతి ఆమోదం పొందాలి అనుకుంటా… ఇవన్నీ జరగాలంటే…
ఇంకా కనీసం రెండు నెలలు పడతాయి. అంటే… డిసెంబర్, జనవరి నెలాఖరు వరకూ వర్గీకరణ అంశం తేలితే… జనవరి నెలాఖరులో కొత్త కేలండర్ ప్రకటించే ఛాన్సుంది. అంటే ఇంకా రెండున్నర నెలల దాకా కొత్త నోటిఫికేషన్లకు టైమ్ ఉంది అనుకుంటున్నారు.
Read this also :Semi Conductors Jobs : 10 లక్షల కొలువుల్లో మీకూ ఒకటి
గత BRS ప్రభుత్వంలో ఎప్పుడో 2022లో నోటిఫికేషన్లు వేసిన వాటికి … రేవంత్ రెడ్డి సర్కార్ మోక్షం కల్పించింది. వాటికి ఎగ్జామ్స్ పూర్తి చేసి… నియామక పత్రాలు కూడా ఇచ్చింది. అవి 50 వేల దాకా ఉన్నాయి. అయితే కాంగ్రెస్ సర్కార్ ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని వాగ్దానం చేసింది… అంటే 50 వేల ఉద్యోగాలు అనేవి BRS గవర్నమెంట్ హయాంలో పడినవి కాబట్టి… కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం అవి కూడా కలుపుకుంటే రెండున్నర లక్షల ఉద్యోగాలు అవుతాయి. మరి అన్ని భర్తీ చేస్తుందా అన్నది డౌట్. అంతకుముందు గవర్నమెంట్ లో ఎప్పుడు నోటిఫికేషన్ పడుతుందో… ఎన్ని సార్లు వాయిదా పడుతుందో తెలీదు. పైగా BRS ప్రభుత్వం రెండు సార్లు కూడా ఎన్నికల ముందే హడావిడిగా నోటిఫికేషన్లు వేసి నిరుద్యోగులను గ్రిప్ లో పెట్టుకోవాలని చూసింది.
ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రేవంత్ రెడ్డి సర్కార్ జాబ్ కేలండర్ ప్రకటించినప్పుడు నిరుద్యోగులు చాలా హ్యాపీగా ఫీలయ్యారు. అంతా సీరియస్ గా ప్రిపరేషన్ మొదలుపెట్టారు. హైదరాబాద్ లాంటి ఏరియాల్లో కోచింగ్ సెంటర్లకు క్యూలు కట్టారు. గ్రూప్ 1, గ్రూప్ 2 వాటికి పాతిక నుంచి 50 వేల దాకా ఫీజులు చెల్లించారు. వాళ్ళంతా ఇప్పుడు అయోమయంలో ఉన్నారు. గవర్నమెంట్ కూడా కోచింగ్ సెంటర్లు పెడతామని హామీ ఇచ్చింది. అవి ఇంకా ఎప్పుడు తెరుస్తారు. ఈ రెండు నెలల్లోనే వాటిని కూడా ఓపెన్ చేస్తే నిరుద్యోగులకు ఉపయోగం. ఖర్చులు తగ్గుతాయి.
గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయిపోయి… మెయిన్స్ జరిగినా… ఇంకా రూల్ ఆఫ్ రిజర్వేషన్ మీద గందరగోళం నడుస్తోంది. పైగా మొన్న సుప్రీంకోర్టు తీర్పు తర్వాత గ్రూప్ 1 విషయంలో మరింత కన్ ఫ్యూజన్ నడుస్తోంది. ఒక్కసారి నోటిఫికేషన్ వేశాక… అందులో మళ్ళీ మార్పులు, చేర్పులు చేయొద్దని స్పష్టంగా చెప్పింది. అయితే నిరుద్యోగులు మాత్రం ప్రభుత్వం ఆ నోటిఫికేషన్ లో 3 మార్పులు చేసిందని వాదిస్తున్నారు.
Read this also : Group.2 కి సరిగా ప్రిపేర్ కాలేదా ! నీ ప్రయత్నం చెయి… ఆపొద్దు!
సరే … గ్రూప్ 1 పరిస్థితి అలా ఉంటే…
ఇప్పటికే గ్రూప్ 3 ఎగ్జామ్ అయిపోయింది. ఇక డిసెంబర్ లో గ్రూప్ 2 పరీక్ష కూడా ఖచ్చితంగా జరుగుతుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. కాకపోతే కొత్త నోటిఫికేషన్ల సంగతి ఏంటనేది సీఎం రేవంత్ రెడ్డి గానీ, ఇతర మంత్రులు గానీ స్పష్టత ఇవ్వడం లేదు. ఖచ్చితంగా రెండు నెలల తర్వాత… లేదంటే ఫిబ్రవరి, మార్చిలో కొత్త జాబ్ కేలండర్ ఇస్తామని క్లారిటీగా ప్రకటించాలని నిరుద్యోగులు కోరుతున్నారు.
SC వర్గీకరణ కోసం… జస్టిస్ షమీమ్ అక్తర్ అధ్యక్షతన వన్‌మెన్ కమిషన్ ఏర్పాటైన కమిషన్ కు జనవరి 11 వరకు గడువు ఉంది. మరోవైపు ఎస్టీ వర్గీకరణ కూడా నిర్వహించాలి. ఇప్పటివరకు రాష్ట్రంలో ST వర్గీకరణకు సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టలేదు. దాని మీద కూడా నిర్ణయం తీసుకోవాలి. ఏదేమైనా రెండున్నర నెలల తర్వాతే కొత్త ఉద్యోగ ప్రకటనలకు ఛాన్స్ ఉంది. అదే విషయం ప్రభుత్వం ప్రకటిస్తే… నిరుద్యోగులు భరోసాగా ఫీలవుతారు. తొందర్లోనే ఈ విషయం తేల్చాలని నిరుద్యోగులు కూడా డిమాండ్ చేస్తున్నారు.
చివరగా ఇంకో మాట….
తెలుగు అకాడమీ పుస్తకాలు వేస్ట్ అని గ్రూప్ 1 ప్రిలిమ్స్ వాదనల సందర్భంగా TGPSC అధికారులు… హైకోర్టుకు అఫిడవిట్ ఇచ్చారు. ఆ తర్వాత గవర్నమెంట్ తరపున అధికారులు గానీ… సీఎం లేదా మంత్రులు ఎవరూ స్పందించలేదు. ఇంతకీ తెలుగు అకాడమీ పుస్తకాలు చదవాలా…. వద్దా…. వాటిని రిఫరెన్స్ గా తీసుకోవాలా వద్దా… లేదంటే… వేల రూపాయలు ఖర్చుపెట్టి… ఇప్పుడు కొత్తగా అన్నీ ప్రైవేట్ పబ్లిషర్స్ పుస్తకాలే కొనుక్కోవాలా… బట్ట కాల్చి మీద వేసిన TGPSC కామ్ గా ఉంది… అటు తెలుగు అకాడమీ అధికారులు కూడా ఏమీ స్పందించలేదు. మధ్యలో నలుగుతోంది మాత్రం… నిరుద్యోగులే… కొత్త జాబ్ కేలండర్ ఎప్పుడు ఇచ్చేది ప్రకటించడంతో పాటు… తెలుగు అకాడమీ పుస్తకాలపైనా క్లారిటీ ఇవ్వాలని తెలంగాణ నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.