ఒకటి కాదు… రెండు కాదు… ఏకంగా 15 పేపర్లకు పైనే…. లీక్ అయ్యాయి.  TSPSC  పేపర్ల లీకుల కుంభకోణం దేశ సరిహద్దులు దాటింది.  అయినా ఛైర్మన్, సెక్రటరీ, సభ్యుల్లో కదలిక లేదు.  మన్ను తిన్న పాముల్లా వ్యవహరిస్తున్నారు.  ముగ్గురు చేతుల్లో భద్రంగా ఉండాల్సిన పేపర్లు… దేశం దాటి పోయినా … మన ఇంట్లో ఏం జరుగుతుంది అన్న సోయి లేకుండా పోయింది ఛైర్మన్ జనార్ధన్ రెడ్డి, సెక్రటరీ అనితా రామచంద్రన్, కమిషన్ సభ్యులకు.  సీక్రెట్ గా ఉండాల్సిన రూమ్స్ లోకి పెన్ డ్రైవ్స్ పెట్టి … జరుగుతున్న ఎగ్జామ్స్ తో పాటు భవిష్యత్తులో జరగబోయే పరీక్షలు… వాటి ఆన్సర్ షీట్లు (మాస్టర్ కాపీలు) తో సహా అన్నీ దొంగిలించుకుపోయారు ఇంటి దొంగలు.

తిన్నింటి వాసాలు లెక్కపెట్టిన దొంగలు… తెలంగాణలో 30 లక్షల మంది నిరుద్యోగుల ఆశలపై నీళ్లు జల్లారు…… కమిషన్ లో పనిచేసే ఉద్యోగులే.  నమ్మిన వాళ్ళే మోసం చేశారు అని…. మీడియా ముందు వాపోయారు టీఎస్పీఎస్ జనార్థన్ రెడ్డి… అయ్యా జనార్థన్ రెడ్డి గారూ… మీ హయాంలో ఇది రెండో తప్పిదం… ఆనాడు… ఇంటర్ బోర్డులో మీరు విద్యాశాఖ కార్యదర్శిగా ఉన్న టైమ్ లోనే … గ్లోబరీనా సంస్థ చేసిన ఘోర తప్పిదాలకు ప్రత్యక్ష సాక్షి మీరు.  మార్కుల షీట్స్ లో జీరోలు పెట్డడంతో భయపడి…   పదుల సంఖ్యలో ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు… అలాంటి మిమ్మల్ని తీసుకొచ్చి.. మంచి ప్రమోషన్ ఇచ్చి…TSPSC ఛైర్మన్ ని చేసింది ప్రభుత్వం.  ఇప్పుడు ఇక్కడ 30 లక్షల మంది ఆశలను నిలువునా ముంచారు.  ఇంత ఘోరమైన తప్పులు … మీ హయాంలోనే జరుగుతున్నా… మిమ్మల్ని ఛైర్మన్ పదవి నుంచి తొలగించాలని ప్రతిపక్ష నేతలు, విద్యార్థి సంఘాలు, నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నా… మీరు నోరు మెదపడం లేదు. పైగా ప్రభుత్వం కూడా మీకు వత్తాసు పలుకుతోంది. అంటే పాలకులకు మీరంటే ఎంత ఇష్టమో దీన్ని బట్టే తెలుస్తోంది… మీరు వాళ్ళకి ఎంత ఉపకారం చేశారో తెలియదు మరి.

ఇంత జరుగుతున్నా… 15 పరీక్షా ప్రశ్నాపత్రాలు లీక్ అయినట్టు తేలినా… ఇప్పటి వరకూ కమిషన్ నుంచి ఎవరూ స్పందించలేదు.  మొదట్లో హడావిడిగా పెట్టిన ఓ చిన్నపాటి మీడియా సమావేశం తప్ప.  కమిషన్ ఛైర్మన్, సెక్రటరీ, సభ్యులు… మీరంతా ఏం చేస్తున్నట్టు.  మీకు బాధ్యత లేదా ?  మీ ఆఫీసులో జరిగిన తప్పుకు మీరు బాధ్యత వహించరా.

నిరుద్యోగులకు భరోసా ఏది ?

లక్షల మంది పెట్టుకున్న ఆశలను అడియాసలు చేసిన ఇప్పుడున్న TSPSC ఛైర్మన్, సెక్రటరీ, సభ్యుల హయాంలోనే ఇక ముందు కూడా పరీక్షలు నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.  చాపకింద నీరులో ఎన్నో యేళ్ళుగా పరీక్ష పేపర్లు లీక్ అవుతూ… లక్షలు, కోట్లు చేతులు మారుతుంటే … కనీసం కనిపెట్టలేని నిస్సహాయ స్థితిలో… చేతగాని వాళ్ళుగా మిగిలారు మీరంతా… మరి ఇప్పుడు మాత్రం మళ్ళీ నిస్పాక్షికంగా పరీక్షలు జరుగుతున్నాయని నిరుద్యోగులను ఎలా నమ్మమంటారు ?

  • నిజంగా ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నట్టుగా… ఇందులో రాజకీయ నేతలు… ముఖ్యంగా అధికార పార్టీ లీడర్ల హస్తం ఉందా ? అందుకే మీరు ఏమీ మాట్లాడ లేకపోతున్నారా ?
  • ఆనాడు నిజామాబాద్ లో 20 మంది ఒకే సెంటర్ నుంచి గ్రూప్ 1 ఉద్యోగులు అయ్యారన్న వార్తను … వాళ్ళల్లో విదేశాల నుంచి రాత్రికి రాత్రే వచ్చి … గ్రూప్ 1 ఎగ్జామ్ రాసి … పోస్టులు సంపాదించిన విషయంలో నిజం ఉందా లేదా ?
  • ప్రవీణ్, రాజశేఖర్ … లీకేజీలో మీ సభ్యులకు తెలిసి జరిగిందా ? లేదా ?
  • లక్షల మంది భవిష్యత్తుతో ముడిపడిన ప్రశ్నాపత్రాలను ఎలాంటి సెక్యూరిటీ లేకుండా … పెన్ డ్రైవ్స్ పెట్టి కాపీ చేసుకునేంత ఈజీగా ఎలా యాక్సెస్ ఇవ్వగలిగారు ?

ఇంకా ఇలాంటి ప్రశ్నలు నిరుద్యోగుల నుంచి వేల సంఖ్యలో వస్తున్నాయి.  వీటికి ఛైర్మన్, సెక్రటరీ, సభ్యుల్లో ఎవరైనా సమాధానం చెప్పగలరా ? లేకపోతే స్వచ్ఛంధంగా మా చేత కాదని రాజీనామా చేస్తారా ?

 

తెలంగాణ వస్తే మా ఉద్యోగాలు మాకు వస్తాయని గుడ్డిగా నమ్మి అధికారం అప్పగించిన బీఆర్ఎస్ పెద్దలు కూడా దీనికి సమాధానం చెప్పాల్సి ఉంది.

(విష్ణుకుమార్ మేడుకొండూరు, సీనియర్ జర్నలిస్ట్, చీఫ్ ఎడిటర్, iReporting )

Leave a Reply