తెలంగాణలో మళ్ళీ స్కూల్స్ బంద్ ?

తెలంగాణలో మళ్ళీ స్కూల్స్ బంద్ ?

రాష్ట్రంలో మళ్ళీ స్కూల్స్ బంద్ అయ్యే అవకాశాలున్నాయి. సర్కారీ బడుల్లో విద్యార్థులు కరోనా బారిన పడుతున్నారు. మంగళవారం ఒక్క రోజే 100 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా తేలింది. విద్యార్థులతో పాటు అధ్యాపకులు, వార్డెన్లూ కరోనా బారిన పడుతున్నారు. దాంతో సర్కారీ విద్యాసంస్థలతో పాటు ప్రైవేటు స్కూళ్ళు, కాలేజీలకు విద్యార్థులను పంపడానికి తల్లిదండ్రులు భయపడుతున్నారు. ఇప్పటికే హైదరాబాద్ తో పాటు కరీంనగర్, మంచిర్యాల, నిజామాబాద్ తదితర జిల్లాల్లో స్కూళ్ళల్లో విద్యార్థులకు కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.

రెండు రోజుల్లో సర్కార్ నిర్ణయం

స్కూళ్ళ బంద్ పై రెండు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. బుధవారం అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ... కరోనా విషయంలో సీరియస్ స్టెప్స్ తీసుకుంటామని ప్రకటించారు. గురువారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిటీ సమావేశం జరగనుంది. అందువల్ల గురు, శుక్రవారాల్లో విద్యాసంస్థలను కొనసాగించాలా... వద్దా అన్నది తేలనుంది. అన్ని క్లాసులను ఆన్ లైన్ లోనే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఆదేశించే అవకాశాలున్నాయి. అయితే 9,10 తరగతుల విద్యార్థులకు క్లాసులు కంటిన్యూ చేస్తూనే... 6 నుంచి 8 తరగతుల వారికి బంద్ పెట్టే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. మరోవైపు - కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు మళ్ళీ ఆన్ లైన్ వైపే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే స్కూళ్ళ యాజమాన్యాలను డిమాండ్ చేస్తున్నారు. తమ పిల్లలను స్కూళ్ళకు పంపేది లేదని చెబుతున్నారు.