SI / PC కి మీరు అప్లయ్ చేస్తారా ?

మన రాష్ట్రం, మన ప్రభుత్వం, మన కొలువులు మనకే దక్కుతాయని నోటిఫికేషన్లు కోసం చాలామంది ఆశతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పోలీస్ శాఖలో 18 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేసుకునేందుకు రాష్ట్ర పోలీస్ శాఖకు అనుమతిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. హైదరాబాద్ ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దాలనుకుంటున్న సర్కార్ ఈ పోలీస్ ఉద్యోగాల భర్తీకి ప్రాధాన్యత ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎస్ఐ/కానిస్టేబుల్ పోస్టుతో యూనిఫాం ఉద్యోగం చేయాలనే ఆసక్తి ఉన్నవారికి మేం గైడెన్స్ ఇస్తున్నాం.

ఎస్ఐ/కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాలంటే అభ్యర్థులకు ఉండవలసిన సామర్థ్యా్న్ని పరీక్షించే విధంగా సెలక్షన్ విధానాన్ని రూపొందించారు. గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే Physical efficient Test కంటే రాత పరీక్షకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నది స్పష్టంగా అర్థమవుతోంది. అందువల్ల అభ్యర్ధులు రాత పరీక్షపై కూడా బాగా దృష్టి పెట్టాలి. పోలీసు శాఖలో ఉద్యోగాలు భర్తీకి జీవో కూడా విడుదల అవడంతో నోటిఫికేషన్ తో వచ్చే వరకూ వెయిట్ చేయకుండా ఇప్పటినుంచే ప్రిపరేషన్ ప్రారంభిస్తే... మీరు విజయానికి ముందు వరుసలో ఉండవచ్చు. ఉద్యోగ ప్రకటన వచ్చిన తరువాత చూద్ధాంలే అనుకుంటే మాత్రం ఉద్యోగ సాధనలో వెనుకబడినట్లే..!

ఎస్ఐ/కానిస్టేబుల్ జాబ్ కోసం ప్రిపేర్ కావాలనుకునే వారు ఆ ఉద్యోగం ప్రాధాన్యతను తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఉద్యోగం రావడం వల్ల కలిగే ఆర్థిక, సామాజిక హోదా, గుర్తింపు లాంటి అంశాలను విశ్లేషించుకుంటే మీలో పట్టుదల మరింత పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో ప్రిపరేషన్ స్థాయి మెరుగుపడుతుంది.

పోలీసు కావాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్న వారు తమ విద్యార్హత, శారీరకంగా ఉండాల్సిన అర్హతలను బట్టి ప్రిపరేషన్ మొదలుపెట్టాలి. చాలా మంది అభ్యర్ధులు తమకు ఈ అర్హతలు ఉన్నప్పటికీ ఎస్ఐ/కానిస్టేబుల్ ఉద్యోగాలపై దృష్టిపెట్టడం లేదు.

దీనికి ప్రధానంగా రెండు కారణాలు:

1) విద్యార్హతలో మంచి మెరిట్ ఉన్నా.. శారీరక పరీక్షలో నెగ్గలేమో అనే భావన

ఇది కేవలం ఒక అపోహ మాత్రమే. ఎలాంటి వ్యక్తి అయినా రెండు నెలలపాటు ప్రతి రోజూ 2 గంటలు గ్రౌండ్ ప్రాక్టీస్ చేస్తే... 5 కి.మీ. లేదా 3 కి.మీ., ఇతర ఈవెంట్లను ఈజీగా అధిగమించవచ్చు.

2) Physical Fitness తో పాటు విద్యార్హత కలిగి ఉన్నవారు రాత పరీక్షలో విజయం సాధించలేమని భావించేవారు .

ఇందులో మళ్లీ రెండు రకాల వ్యక్తులు ఉంటారు. వారిలో మొదటి వారు తమది మ్యాథ్స్ నేపథ్యం కాదనీ, మ్యాథ్స్ చేయడం కష్టమని అనుకొని ఉద్యోగాన్నే లక్ష్యంగా పెట్టుకోని వారు, రెండో వారు తమది సాంఘిక శాస్త్ర నేపథ్యం కాదనీ... ఆ సబ్జెక్ట్ చదవడం, అందులో విషయాలు గుర్తు పెట్టుకోవడం కష్టమనుకుంటారు.

కానీ సిలబస్ ను, గత ప్రశ్నపత్రాలను నిశితంగా పరిశీలిస్తే ఎలాంటి బ్యా్గ్రౌండ్ తో సంబంధం లేకుండా కేవలం విషయ ప్రాధాన్యత ఆధారంగా ప్రశ్నలుంటున్నాయి. గత ఐదు ఎస్ఐ పరీక్షల్లో అడిగిన పరీక్షల సరళిని గమనిస్తే అర్థమెటిక్ విభాగం నుంచి దాదాపు 100 మార్కులు వస్తున్నాయి. ఈ మార్కుల్లో ప్రధానంగా గణితంలో ప్రాథమికాంశాలు (బేసిక్ మ్యాథ్స్), క్షేత్రగణితం, సంఖ్యా వ్యవస్థ, సగటు, శాతాలు, లాభనష్టాలు, కాలం-పని, కాలం-దూరం వంటి తదితర అంశాల నుంచి సుమారు 70 మార్కులు వస్తున్నాయి. మిగిలిన అంశాల నుంచి 30 మార్కులు వస్తున్నాయి. కేవలం క్షేత్రగణితం నుంచే 12 నుంచి 20 ప్రశ్నలు అడుగుతున్నారు.

మార్కులు వారికేనా?

ఎస్ఐ/కానిస్టేబుల్ ఉద్యోగ సాధనలో అర్థమెటిక్, రీజనింగ్ పేపర్ ది కీలపాత్ర. ఈ పేపర్ లో మ్యాథ్స్ విద్యార్థులకే ఎక్కువ మార్కులు వస్తాయనేది అపోహ మాత్రమే. ఇది నిజాంకాదనే చెప్పవచ్చు. గతంలో జరిగిన పరీక్షల సిలబస్ ను పరిశీలిస్తే... 10వ తరగతి స్థాయి అని మాత్రమే చెప్పారు. అందువల్ల మ్యాథ్స్ నేపథ్యం లేనివారు భయపడాల్సిన అవసరం లేదు. పరీక్షలో అడిగే విషయాలన్నీ పాఠశాల స్థాయిలో చదివే ఉంటాం. అందువల్ల మరోసారి ప్రాక్టీస్ చేయడంతో పాటు Short-cuts జోడించి ప్రిపరేషన్ ప్రారంభిస్తే సులభంగా ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు. సంఖ్యా వ్యవస్థ, చక్రవడ్డి, బారువడ్డి, నిష్పత్తి, అనుపాతం, సగటు, శాతాలు, లాభం, నష్టాలు, కాలం-పని, కాలం-దూరం, పని-వేతనాలు, భాగస్వామ్యం, క్షేత్రగణితం, గడియారాలు, క్యాలండర్ లాంటి అంశాలపై దృష్టి పెట్టాలి.

ప్రశ్నాపత్రాలు అభ్యర్ధుల ప్రాథమిక జ్ఞానాన్ని (Basic Knowledge) పరీక్షించే విధంగా ఉంటాయి. ప్రాథమిక పరిజ్ఞానం అంటే కేవలం 10వ తరగతి వరకు చదివిన సబ్జెక్టుల్లోని అంశాలపై అభ్యర్ధులకు ఉన్న అవగాహన, విషయం పరిజ్ఞానాలను పరీక్షిస్తారు. దీనికి అదనంగా రీజనింగ్ అనే అంశాన్ని చేర్చారు. దీంతో ఉద్యోగార్థుల మెంటల్ ఎబిలిటీని పరీక్షిస్తున్నారు. ఈ విభాగంలో వచ్చే అన్ని ప్రశ్నలు సాధారణ స్థాయి విద్యార్థులు సాధించేలాగే ఉంటాయి. అందువల్ల మ్యాథ్స్, సైన్స్, సోషల్ సబ్జెక్టుల్లో దేనికి చెందినవారైనా అన్ని విషయాలను క్షుణ్ణంగా అభ్యసనం చేస్తే సులభంగా ఉద్యోగం సాధించవచ్చు.