ప్రత్యక్ష తరగతులపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

ప్రత్యక్ష తరగతులపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

విద్యా సంస్థల్లో ప్రత్యక్ష తరగతుల బోధనపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యక్ష బోధనకు రావాలని విద్యార్థులను బలవంతం చేయొద్దని ఆదేశించింది. అలా హాజరు కాని విద్యార్థులపై చర్యలు తీసుకోవద్దన్నది. అలాగే ప్రత్యక్ష తరగతులు నిర్వహించని విద్యా సంస్థలపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కూడా హైకోర్టు తెలిపింది. ఆన్‌లైన్ లేదా ప్రత్యక్ష బోధనపై విద్యా సంస్థలే నిర్ణయించుకోవచ్చు. ప్రత్యక్ష బోధన నిర్వహించే పాఠశాలలకు మార్గదర్శకాలు జారీ చేయాలని కూడా ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. వారంలోగా గైడ్ లైన్ ఇవ్వాలని విద్యాశాఖకు ఆదేశాలిచ్చింది. అలాగే స్కూళ్ళ
పాటించాల్సిన గైడ్ లైన్స్ పైనా ప్రచారం చేయాలని హైకోర్టు కోరింది. ఇక గురుకులాలు, హాస్టళ్లలో ప్రత్యక్ష బోధనపై హైకోర్టు స్టే విధించింది. గురుకులాలు, విద్యాసంస్థల్లో హాస్టళ్ళను తెరవద్దని హైకోర్టు ఆదేశించింది. వీటిల్లో వసతులపై నివేదిక ఇవ్వాలని కోరింది. ప్రత్యక్ష బోధనపై పరస్పర విరుద్ధ లాభనష్టాలు ఉన్నాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. రాష్ట్రంలో కొవిడ్ తీవ్రత ఇంకా కొనసాగుతోందన్న హైకోర్టు... సెప్టెంబరు లేదా అక్టోబరులో మూడో దశ పొంచి ఉందని హెచ్చరికలను లెక్కలోకి తీసుకోవాలన్నది. విద్యా సంస్థలు తెరవకపోతే విద్యార్థులు నష్టపోతున్నారన్న అభిప్రాయాలు ఉన్నాయనీ... అయితే ప్రభుత్వం రెండింటిని సమన్వయం చేసి చూడాలని హైకోర్టు కోరింది. విచారణను అక్టోబరు 4కి వాయిదా వేసింది హైకోర్టు.