Saturday, April 20

PSLV C-43 విజయవంతం

వరుస విజయాలతో దూసుకెళ్తున్న భారత అంతరిక్ష శాస్త్రవేత్తలు మరో విక్టరీని తమ ఖాతాలో వేసుకున్నారు. PSLV-C43  రాకెట్ ప్రయోగాన్ని దిగ్విజయంగా చేపట్టారు శాస్త్రవేత్తలు. మన దేశానికి చెందిన హైపవర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ శాటిలైట్ ను మొదట విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఇది భూ పరిశీలన ఉపగ్రహం. దీంతో మన దేశ అవసరాలు చాలా వరకు తీరతాయి. ఐదేళ్ల పాటు దేశ రక్షణ రంగానికి సేవలు అందించనుంది ఈ శాటిలైట్. విదేశాలకు చెందిన 30 ఉపగ్రహాలను కూడా  కక్ష్యల్లోకి ప్రవేశపెట్టారు. అమెరికాకి చెందిన 23 శాటిలైట్లను దిగ్విజయంగా వాటి కక్ష్యల్లో ప్రవేశపెట్టింది PSLV-C43 రాకెట్. తాజాగా ప్రయోగించిన వాటిలో ఒకటి మైక్రో, 29 నానో ఉపగ్రహాలున్నాయి. PSLV సిరీస్ లో ఇది 45వ ప్రయోగం. తాజా విజయంపై శాస్త్రవేత్తలను ఇస్రో ఛైర్మన్ శివన్ అభినందించారు. డిసెంబర్ లో GSLV ద్వారా జీ శాట్ 7 ఏ ఉపగ్రహాన్ని ప్రయోగిస్తామన్నారు. వచ్చే ఏడాది అత్యంత ప్రతిష్టాత్మకమైన చంద్రయాన్ 2 ను చేపడుతున్నట్లు వివరించారు.

భూ పరిశీలన, సముద్రంలో ఓడల కదలికలకు ఉపయోగపడే అమెరికాకు చెందిన ఫ్లోక్  3ఆర్  ఉపగ్రహాలు 16, గ్లోబల్ -1, సీసీరో-8, 4 లేమూర్ , హెచ్ శాట్ -1 ఉపగ్రహాలున్నాయి. సెస్ ట్యూరీ అనే ఉపగ్రహం ఆస్ట్రేలియాకు చెందినది... రిమోట్  ఇంటర్నెట్  సేవలకు ఇది ఉపయోగపడుతుంది. కెన్యాకు చెందిన కేప్లెర్ ఉపగ్రహం ఇంటర్నెట్ కోసం పనిచేస్తుంది. కొలంబియాకు చెందిన ప్యాక్ శాటిలైట్, ఫిన్లాండ్ శాటిలైట్ లీయార్టర్ హలో వరల్డ్, మలేషియాకు చెందిన ఇన్నోశాట్-2లను భూపరిశీలన కోసం వినియోగిస్తారు.  నెదర్లాండ్ కు చెందిన హిబేర్-1 ఉపగ్రహాన్ని ఇంటర్నెట్ సేవలకు, స్పెయిన్ శాటిలైట్ 3క్యాట్-1 ను సైంటిఫిక్ ఎక్స్ పరిమెంట్ కోసం వాడతారు.