Wednesday, October 23

ఇక ఆన్‌లైన్‌ భారీ డిస్కౌంట్లు లేనట్టే !

30శాతం తగ్గింపు !
బిగ్ డే సేల్ !!

దినపత్రికల్లో, టీవీల్లో ఇలాంటి ప్రకటనలు ఇకముందు ఉండకపోవచ్చు. ఆఫ్ లైన్ కన్నా ఆన్‌లైన్‌లోనే ఎక్కువ డిస్కౌంట్స్ ఇచ్చే రోజులు పోతున్నాయి. కొత్త ఇ-కామర్స్ పాలసీ 2019 ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వస్తోంది. దాంతో ఆన్‌లైన్‌ అమ్మకాలకు భారీగా గండిపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మొన్న మొన్నటిదాకా ఫ్లిప్ కార్ట్, అమెజాన్ సంస్థలు పోటా పోటీగా డిస్కౌంట్స్ ప్రకటించాయి. దాంతో చాలామంది వినియోగదారులు ఆన్‌లైన్‌ లోనే తమకు కావాల్సిన వస్తువులు కొనుక్కున్నారు. అంతేకాదు కొన్ని సంస్థలైతే బయటి మార్కెట్ కి తమ వస్తువులను రిలీజ్ చేయకుండా కేవలం ఆన్‌లైన్‌ లో ఈ-కామర్స్ సంస్థల ద్వారా అమ్ముకొని భారీగా లాభపడ్డాయి. ఇటు వినియోగదారులకు కూడా డిస్కౌంట్స్ బాగానే అందాయి. అయితే కొత్త ఈ-కామర్స్ పాలసీతో అమెజాన్, ఫ్లిప్ కార్ట్ బిజినెస్ భారీగా తగ్గే అవకాశముంది. అదే టైమ్ లో స్థానిక వ్యాపారులకు వ్యాపారం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇప్పటిదాకా ఆన్‌లైన్‌ అమ్మకాల పేరుతో బడా కంపెనీలు ప్రభుత్వ నిబందనలను ఉల్లంఘిస్తున్నాయని అంటున్నారు కేంద్ర ప్రభుత్వ అధికారులు. ఒక కంపెనీ తాము ఉత్పత్తి చేసిన వస్తువుల్లో 25శాతానికి పైగా ఉత్పత్తులను ఒకే ఇ-కామర్స్ సంస్థకి అమ్మడానికి అవకాశం ఉండదు. దాంతో EXCLUSIVE SALES కి బ్రేక్ పడినట్టే. అమెజాన్, ఫిప్ కార్ట్ లాంటి సంస్థలు బిగ్ సేల్స్ డేలు నిర్వహించే అవకాశం కూడా ఉండదు. అలాగే ఫాస్ట్ డెలివరీల పేరుతో ఏ ఒక్క వినియోగదారుడిపై వివక్ష చూపకూడదు. అంటే ఈ ప్రభావం అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ పై తప్పకుండా పడుతుంది. క్యాష్ బ్యాక్, ఉచిత డెలివరీలపైనా ఆంక్షలు రాబోతున్నాయి.

కొత్త విధానంతో అమెజాన్, ఫ్లిప్ కార్ట్ సొంత బ్రాండ్స్ కి కూడా ఇబ్బందులు తప్పవు. వాటిని కూడా భారీ డిస్కౌంట్స్ తో అమ్ముకోడానికి అవకాశం ఉండదు. అయితే ఇప్పటికే ఫ్లిప్ కార్ట్ లో 16 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టిన వాల్ మార్ట్ లాంటి సంస్థలకు కొత్త పాలసీతో కష్టాలు వచ్చినట్టేనని భావిస్తున్నారు.