Wednesday, September 18

నిరుద్యోగ భృ‌తి లేనట్టే !

రాష్ట్ర బడ్జెట్ లో ఈసారి నిరుద్యోగ భృతికి ఎలాంటి నిధులను ప్రభుత్వం కేటాయించలేదు. 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలోని నిరుద్యోగలకు నెలవారీగా నిరుద్యోగ భృతి ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. కానీ 2019-20 సంవత్సరానికి సోమవారం ప్రకటించిన పూర్తి స్తాయి బడ్జెట్ లో దాని ఊసు ఎత్తలేదు. పార్లమెంట్ ఎన్నికల ముందు నిరుద్యోగ భృతికింద ప్రభుత్వం రూ.1810 కోట్లు కేటాయించింది. రూ.3016 చొప్పున ఇస్తామని కూడా ప్రకటించారు. అప్పటి లెక్కల ప్రకారం రాష్ట్రంలో 5 లక్షల మంది నిరుద్యోగులకు ఈ భృతిని అందించే అవకాశం ఉండేది. కానీ ప్రస్తుత బడ్జెట్ లో నిరుద్యోగ భృతికి ఎలాంటి నిధులు కేటాయించలేదు. దాంతో నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడం లేదు. పైగా ఉద్యోగుల రిటైర్ మెంట్ వయస్సును 61 యేళ్ళకు పెంచే ప్రపోజల్ కూడా పరిశీలిస్తోంది. మున్సిపల్ ఎన్నికల తర్వాత ఈ ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో నిరుద్యోగ భృతి అంశాన్ని కూడా పక్కన బెట్టడంపై నిరుద్యోగ, విద్యార్థి సంఘాలు ఆగ్రహంగా ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చి... ఆ తర్వాత పార్లమెంటు ఎన్నికలకు ముందు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో కేటాయింపులు చేస్తున్నట్టు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికలు అయిపోయాక అసలు నిధులే కేటాయించకపోవడంపై మండిపడుతున్నారు.