Monday, December 16

కొత్త జిల్లాల ప్రకారమే పోలీస్ ఉద్యోగాలు

రాష్ట్రంలో 18వేల పోలీస్ ఉద్యోగాల రిక్రూట్ మెంట్ ప్రాసెస్ జూన్ మొదటి వారంలో పూర్తి చేసేందుకు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్ మండలి కసరత్తు చేస్తోంది. కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాల భర్తీని కొత్త జిల్లాల ప్రకారమే నిర్వహించనుంది. అంటే ఈమధ్య ఏర్పడ్డ ములుగు, నారాయణ పేట మినహా మిగతా 31 జిల్లా కేంద్రాల్లో రిక్రూట్ మెంట్ ప్రాసెస్ జరగనుంది. ఫైనల్ ఎగ్జామ్ లో ఉత్తీర్ణులై ఉద్యోగాలు పొందిన అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన కార్యక్రమం 31 జిల్లా కేంద్రాల్లో నిర్వహించడానికి పోలీస్ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. దీనికి సంబంధించిన ప్రక్రియ చేపట్టేందుకు జిల్లా కేంద్రాలకు ఇప్పటికే ఆదేశాలు కూడా అందాయి.

జూన్ మొదటి వారంలో పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన ఫలితాలను ఒకదాని తర్వాత మరొకటి వెల్లడిస్తారు. మరోవైపు - ఈసారి పోస్టులు మిగలకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. అభ్యర్థులు SI, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల పరీక్షలు రాసి... రెండింటీలోనూ ఉత్తీర్ణులైతే చాలామంది SI ఉద్యోగాన్నే కోరుకుంటారు. అప్పుడు వాళ్ళు కానిస్టేబుల్ ఉద్యోగాన్ని వదులుకుంటారు. అందుకే ఆ పోస్టులు మిగిలిపోకుండా రిక్రూట్ మెంట్ ప్రాసెస్ లోనే వాటిని కూడా భర్తీ చేసేలా పోలీస్ శాఖ చర్యలు తీసుకుంటోంది.