Wednesday, September 18

పంచాయతీ కార్యదర్శుల ఫలితాలపై అధికారుల వివరణ

జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పరీక్షలు, ఫలితాలపై వస్తున్న ఆరోపణలకు పంచాయతీ రాజ్ శాఖ అధికారులు వివరణ ఇచ్చారు. ఈ పోస్టుల భర్తీలో రిజర్వేషన్లు 50 శాతం దాటలేదని వివరించారు. 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చామని చెప్పారు. ప్రాథమిక కీ విడుదల చేసి... అభ్యంతరాలు తీసుకున్నామనీ... ఆ తర్వాత సబ్జెక్ట్ నిపుణులతో ఫైనల్ కీ తయారు చేయించామని చెప్పారు.  ఆ ఫైనల్ కీ ప్రకారమే పేపర్ కరెక్షన్ చేశామన్నారు. ప్రస్తుతం తాత్కాలిక సెలెక్ట్ లిస్ట్ ప్రకటించామనీ...
మార్క్ లిస్టులు, మెరిట్ లిస్టులు కూడా జిల్లాల వారీగా విడుదల చేశామన్నారు పంచాయతీ అధికారులు.

అభ్యర్థులకు రాష్ట్ర స్థాయి ర్యాంక్ ఇచ్చామన్నారు. అభ్యర్థులు ఎన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇచ్చారో, ఎన్ని ప్రశ్నలకు తప్పు సమాధానం ఇచ్చారో వారి ర్యాంక్ కార్డుల్లో పొందుపరిచామని తెలిపారు. గురువారం నుంచి అభ్యర్థులకు Omr sheets కూడా అందుబాటులోకి తెచ్చామన్నారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల రిక్రూట్ మెంట్ అంతా పారదర్శకంగానే జరిగిందంటున్నారు అధికారులు. ఇదే విషయాన్ని కోర్ట్ కి తెలుపుతామన్నారు. కోర్ట్ ఆదేశాల మేరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ నిర్వహిస్తున్నామన్నారు. తదుపరి కోర్టు ఉత్తర్వుల మేరకు నడుచుకుంటామని పంచాయతీ రాజ్ అధికారులు వివరించారు.