Monday, September 23

గ్రూప్ 2పై హైకోర్టులో వాదనలు : ఈనెల 5కి వాయిదా

TSPSC గ్రూప్ - 2 ఎగ్జామ్స్ కి సంబంధించి హైకోర్టులో వాదనలు ప్రారంభం అయ్యాయి. రాత పరీక్షలో ఇన్విజిలేటర్లకు అవగాహన లేకపోవడం వల్లే తప్పులు చేశారని అభ్యర్థులు హైకోర్టుకి విన్నవించారు. డబుల్ బబ్లింగ్ చేసిన వారిని అనుమతించరాదంటూ సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన తీర్పును అభ్యర్థులు హైకోర్టులో సవాల్ చేశారు.

గ్రూప్ - 2 పరీక్షల్లో డబుల్ బబ్లింగ్, వైట్ నర్ ఉపయోగించిన అభ్యర్థులను ఎంపిక జాబితా నుంచి తొలగించాలని 2018 అక్టోబర్ 12న సింగిల్ బెంచ్ జడ్జి తీర్పు చెప్పారు. అభ్యర్థుల తరపున నలుగురు సీనియర్ న్యాయవాదులు తమ వాదన వినిపించారు. పార్ట్ - ఎలో వ్యక్తిగత వివరాల నమోదులో మాత్రమే అభ్యర్థులు పొరపాట్లు చేశారని అన్నారు. అలాగే పార్ట్ -బిలో ఆన్సర్లు దిద్దినా వైట్ నర్ ఉపయోగించిన జవాబు పత్రాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని వాదించారు.

ఇన్విజిలేటర్లకు TSPSC సరైన అవగాహన కల్పించలేకపోవడంతోనే ఈ తప్పులు దొర్లాయని అభ్యర్థులు వాదించారు. అభ్యర్థులు టెన్షన్, అయోమయం వల్లే తప్పులు చేశారని సాంకేతిక కమిటీ కూడా నిర్ధారించిందని హైకోర్టు ధర్మాసనం దృష్టికి తెచ్చారు అభ్యర్థుల తరపు న్యాయవాదులు. హైకోర్టు ఏర్పాటు చేసిన సీనియర్ న్యాయవాదుల బృందం కూడా దీనిపై సమగ్రంగా నివేదిక ఇచ్చిందన్నారు. అభ్యర్థుల విలువైన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ... వ్యక్తి గత అంశాల నమోదులో డబుల్ బబ్లింగ్, వైట్ నర్ ఉపయోగించిన వారికి తుది జాబితా చోటు కల్పించాలని కోరారు. 55 వేల ఆన్సర్ షీట్స్ ను TSPSC వ్యక్తిగతంగా పరిశీలించి న్యాయం చేయాలని కోరారు. దీనిపై వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం కేసును ఈనెల 5కి వాయిదా వేసింది.