Sunday, January 20

పోలీస్ ఫిట్నెస్ టెస్టులు ఎప్పుడో ?

రాష్ట్రంలో పోలీస్ రిక్రూట్ మెంట్ కు సంబంధించి జరగాల్సిన దేహ దారుఢ్య పరీక్షలు ఎప్పుడు జరుగుతాయోనని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. డిసెంబర్ 17 నుంచే టెస్టులు నిర్వహించేందుకు పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు షెడ్యూల్ ప్రకటించింది. అయితే కానిస్టేబుల్, SI ప్రిలిమ్స్ ఎగ్జామ్ లో కొన్ని ప్రశ్నలు తప్పుగా ఇచ్చారంటూ కొందరు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించడంతో ఫిట్నెస్ టెస్టులను బోర్డు వాయిదా వేసింది.

ప్రస్తుతం న్యాయస్థానంలో ఈ కేసు విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం యధాతధ స్థితి కొనసాగుతుండటంతో టెస్టుల నిర్వహణలో మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కనీసం సంక్రాంతి తర్వాత అయినా ఈ విషయంలో స్పష్టత వస్తుందని బోర్డు అధికారులు భావిస్తున్నారు. అప్పుడు దేహదారుఢ్య పరీక్షలు మొదలుపెట్టినా ఫిబ్రవరి నెలాఖరు దాకా అవి కొనసాగే అవకాశం ఉంది. ఆ తర్వాత 45 రోజులకు మెయిన్స్ పరీక్షను ఏప్రిల్ నెలాఖరులోగా నిర్వహించే ఛాన్స్ ఉంది. ఇప్పటికే హైదరాబాద్ లాంటి నగరాల్లో హాస్టల్స్ లో ఉండి ఫిట్నెస్ ట్రైనింగ్ అవుతున్న అభ్యర్థులు ఆర్థిక ఇబ్బందులుతో సతమతం అవుతున్నారు. ఇటీవల కాలంలో చలి బాగా పెరిగింది. అయినా పాపం పట్టు వదలకుండా పురుష అభ్యర్థులతో పాటు మహిళా అభ్యర్థులు కూడా ఉదయాన్నే ప్రాక్టీస్ కోసం గ్రౌండ్స్ కి వెళ్తున్నారు. ఫిట్నెస్ టెస్టులపై స్పష్టత రాకపోవడంతో వాళ్ళంతా ఆందోళనలో ఉన్నారు. ప్రభుత్వం చొరవ తీసుకొని న్యాయస్థానంలో కేసు తొందరగా పరిష్కారం అయ్యేందుకు ప్రయత్నించాలని అభ్యర్థులు కోరుకుంటున్నారు.

రాష్ట్రంలో మొత్తం 3 లక్షలమంది అభ్యర్థులు ఈ ఫిట్నెస్ టెస్టుల కోసం ఎదురు చూస్తున్నారు.