Sunday, January 20

పోలీస్ ఫిట్నెస్ కు మళ్ళీ అభ్యర్థుల కొత్త జాబితా

రాష్ట్రంలో జరుగుతున్న పోలీస్ ఉద్యోగాల నియామకాల ప్రాసెస్ మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర హైకోర్టు సూచనల మేరకు దేహదారుఢ్య పరీక్షలకు ఎంపికైన అభ్యర్థుల కొత్త జాబితాను బోర్డు మళ్లీ విడుదల చేయాల్సి ఉంది. ఈ ప్రాసెస్ కు మరో 20 రోజులు పట్టే అవకాశాలు ఉన్నాయి.

రాష్ట్రంలో 16,925 కానిస్టేబుల్స్, 1217 ఎస్సై పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి 2018 మే 31న నోటిఫికేషన్ ఇచ్చింది. వీటికి సంబంధించిన ప్రిలిమినరీ పరీక్షలను పూర్తి చేసింది. ఆ తర్వాత ఫలితాలను వెల్లడించి మెరిట్ లిస్ట్ విడుదల చేసింది. అయితే ప్రాథమిక ప్రశ్నాపత్రంలో కొన్ని ప్రశ్నలు ఔట్ ఆఫ్ సిలబస్ ఉన్నాయంటూ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన న్యాయస్థానం 6 ప్రశ్నలపై స్పష్టత లేకపోవడంతో వాటిని తొలగించాలని కోరింది. ఆ తర్వాత దేహ దారుఢ్య పరీక్షలకు కొత్త మెరిట్ జాబితా రెడీ చేయాలని ఆదేశించింది. ఈ కొత్త జాబితా తయారీకి మరో 20 రోజులు పట్టే అవకాశం ఉంది.

అయితే ఫిబ్రవరిలో పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుండటంతో 20 రోజుల తర్వాత ఈ జాబితా ప్రకటించి ఫిట్నెస్ పరీక్షలు నిర్వహిస్తారా... అన్నది సందేహంగా మారింది. పోలీస్ అధికారులు, సిబ్బంది ఎన్నికల విధుల్లో బిజీ అయితే ఈ టెస్టులను పర్యవేక్షించడం కష్టం అవుతుంది. ఎందుకంటే ఫిట్నెస్ టెస్టుల నిర్వహణకు నెల నుంచి 45 రోజుల దాకా పడుతుంది. ఎన్నికల టైమ్ లో ఫిట్నెస్ టెస్టులు నిర్వహించడం కష్టమేనని అంటున్నారు. పార్లమెంటు ఎన్నికలు ఏప్రిల్ కల్లా ముగుస్తాయి. ఆ తర్వాతే ఫిట్నెస్ టెస్టులు నిర్వహించే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. ఇప్పటికే ఫిట్నెస్ టెస్టుల కోసం రేయింబవళ్ళు కష్టపడుతున్న నిరుద్యోగ అభ్యర్థులు నిరాశగా ఉన్నారు. సిటీల్లో వేల రూపాయలు ఖర్చుపెట్టి హాస్టల్స్ లో ఉంటున్న వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఎగ్జామ్ నిర్వహణ పకడ్బందీగా ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు కదా అని అభ్యర్థులు వాపోతున్నారు.