పదో తరగతి పాసయ్యాక ఏం చేయాలి… ?
ప్రతి విద్యార్థి జీవితంలోనూ కీలకమైన టెన్త్ క్లాసే. ఎందుకంటే మన భవిష్యత్ జీవితాన్ని ఎలా మలుచుకోవాలన్నది టెన్త్ తర్వాత నిర్ణయించుకోవాలి. పదో తరగతి దాకా తల్లిదండ్రులు, ఉపాధాయుల సంరక్షణలో ఉంటారు. పైగా అన్ని సబ్జెక్టులు చదువుకుంటారు. కానీ టెన్త్ దాటితే ... సైన్స్, ఆర్ట్స్, కామర్స్, టెక్నికల్ ... ఏరంగాన్ని ఎంచుకోవాలన్న ఇక్కడే డిసైడ్ చేసుకోవాల్సిన టైమ్. మీరు 15-16 యేళ్ళ వయసులో ఉంటారు కాబట్టి... మీ అంతట మీరు నిర్ణయం తీసుకునే వయసు కూడా కాదు. అందుకే పెద్దలు, ఉపాధ్యాయులు, సబ్జెక్టు నిపుణుల సలహాలు తీసుకొని భవిష్యత్ పై ముందడుగు వేయాలి. అన్నింటికంటే మనకు ఎందుకు ఇంట్రెస్ట్ ఉంది అన్నది కూడా క్రాస్ చెక్ చేసుకోవాలి.
మనలో చాలామంది లెక్కలకు భయపడి MPCని దూరం చేసుకొంటారు. అలాగే సోషల్, బయాలజీ ...ఇలా టెన్త్ వరకూ ఏదో ఒక సబ్జెక్ట్ లో చాలామందికి భయాలు ఉంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని... ఇంటర్ లో మనం మిగతా గ్రూప్ మొత్తాన్ని లేదా మిగతా సబ్సెక్టులను త్యాగం చేసే పరిస్థితి ఉండకూడదు.
నిజంగా మనం ఇంజనీర్ లేదా ఐటీ ప్రొఫెషనల్ గా స్థిరపడాలనుకుంటే MPC తప్పదు. డాక్టర్ కావాలనుకుంటే BPC , ఛార్టెడ్ అకౌంటెంట్ లేదా ఇతర బిజినెస్ ఫీల్డ్స్ లో స్థిరపడాలనుకుంటే CEC... ఇలా ఏదో ఒక ఎయిమ్ పెట్టుకొని ఆయా సబ్జెక్టులను ఎంచుకోక తప్పదు. అప్పుడే మీ కెరీర్ గ్రాఫ్ ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా పైకి పోతుంది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవడంతోపాటు... మనం ఆయా సబ్జెక్టులు తీసుకుంటే ఎంతవరకూ నెగ్గుకు రాగలం అన్నది కూడా బేరీజు వేసుకోవాలి.
రాష్ట్రంలో ఎక్కువగా గ్రామీణం నుంచి వచ్చిన విద్యార్థులే ఉంటారు. వారిలో చాలామందికి హైస్కూల్స్ లో సరైన గైడెన్స్ లేకపోవడంతో తమకు ఇష్టం ఉన్న గ్రూపులను వదిలిపెట్టి...ఎవరో పక్కింటి వాళ్ళబ్బాయి... ఎదురింటి అంకుల్ చెప్పాడనో ఏదో ఒక నిర్ణయానికి వస్తారు. పెద్దల సలహాలు తీసుకోవాలి...ఎవరూ కాదనలేం. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి.... మీ భవిష్యత్తును మీరే నిర్ణయించుకోవాలి. అందుకే ఒకటి నాలుగు సార్లు ఆలోచించుకొని... మన ఎయిమ్ ను దృష్టిలో పెట్టుకొని ఇంటర్ లో గ్రూపులను ఎంచుకోండి. స్నేహితులంతా ఏదో గ్రూపులో చేరుతున్నారని మీరు అదే గ్రూప్ లో జాయిన్ అవడం కూడా మంచిదికాదు. స్నేహితులు వేరు... మనం చదివే చదవు వేరు అన్నది గుర్తుంచుకోండి.
ఇక ఇంటర్ గ్రూపుల ఎంపికల తల్లిదండ్రుల పాత్ర కూడా కీలకం. విద్యార్థికి ఎందులో ఇష్టం ఉందో తెలుసుకోవాలి. పిల్లల శక్తి సామర్థ్యాలు, వాళ్ళు ఎందులో రాణించగలరు...ఆ కోర్సులో కెరీర్ ఎలా ఉంటుంది... లాంటి విషయాలపై ఒకటికి పది సార్లు ఆలోచించి... విద్యార్థికి సరైన గైడెన్స్ ఇవ్వాలి. మీ కోరికను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పిల్లలపై రుద్దకండి. మీ ఇష్టానుసారం చదవాలనుకుంటే ... తమ ఆశయం నెరవేరడం లేదని పిల్లలు డిప్రెషన్ లోకి వెళ్ళే ప్రమాదం కూడా ఉంటుంది. పైగా ఆసక్తిలేని చదువుల్లో రాణించలేక ఫెయిల్ అయితే భవిష్యత్తులో పిల్లలతో పాటు మీరూ ఇబ్బంది పడక తప్పదు. ఈ విషయంలో టీచర్ల అభిప్రాయాలను కూడా సేకరించాలి.
- టెక్నికల్ రంగంపై ఇష్టం ఉంటే పాలిటెక్నిక్, ఐటీఐలు, ఒకేషనల్ కోర్సులు చేయొచ్చు.
- ఇంజనీర్ కావాలంటే ఇంటర్ ఎంపీసీ తీసుకోవాలి.
- వ్యవసాయం, వైద్యరంగంపై ఇంట్రెస్ట్ ఉంటే BPC తీసుకోవాలి.
- వ్యాపారం, అకౌంటెంట్స్ గా స్థిరపడాలనుకుంటే CEC
- టీచర్లు, ఇతర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడాలనుకుంటే HEC తీసుకోవాలి.
మీకు ఏ కోర్సులు తీసుకోవాలన్న దానిపై కన్ఫ్యూజన్ ఉంటే... మీ క్వొశ్చన్ ను మాకు పోస్ట్ చేయండి... నిపుణులతో సలహాలు ఇప్పిస్తాం.