Monday, December 17

పల్లెకు పోదాం ! ఓట్లేద్దాం !!

పట్టణాలు, నగరాలు పల్లె బాట పట్టాయి. జనమంతా ఓట్లేసేందుకు గ్రామాలకు వెళ్తున్నారు. నగరంలో ఎంతో బిజీగా ఉన్నా సరే... ఊళ్ళల్లో ఓట్లేయాల్సిందే అంటున్నారు. దీంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో ఫుల్ రష్ కనిపిస్తోంది. హైదరాబాద్ MGBS, JBS తో పాటు LB నగర్ లో కూడా ప్రయాణీకుల రద్దీ కనిపిస్తోంది. ఆర్టీసీ కూడా ప్రయాణీకుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. శుక్రవారం పోలింగ్ తర్వాత శని, ఆదివారాలు సెలవు కావడంతో ప్రైవేటు ఉద్యోగుల్లో సంతోషంగా కనిపిస్తోంది. ఊళ్ళో ఓట్లు వేయడంతో పాటు వీకెండ్ ను ఎంజాయ్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఊళ్ళల్లో బంధువుల్ని కూడా కలుసుకోవచ్చని సంబురపడుతున్నారు.

జనం రద్దీని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలోని ఇతర నగరాల నుంచి కూడా హైదరాబాద్ కి బస్సులను తెప్పించారు ఆర్టీసీ అధికారులు. సిటీలో ఉన్న కండీషన్ బస్సులను కూడా గ్రామాలకు పంపుతున్నారు. జనం రష్ ను అంచనా వేస్తూ బస్సులు నడుపుతున్నామని చెబుతున్నారు. సంక్రాంతి టైమ్ లోనే జనరల్ గా ఇలాంటి రద్దీ కనిపిస్తోంది. అయితే ఈసారి పట్టణాల్లో ఉండే పల్లె జనం కూడా ఓట్లు వేయాలన్న కసితో బయల్దేరుతున్నారు. అయినా బస్సులు సరిపడనన్ని లేవని అంటున్నారు కొందరు.

కొన్ని రాజకీయ పార్టీలు రాను పోను ఛార్జీలు కూడా చెల్లిస్తామని... గ్రామాల నుంచి ఫోన్లు చేసి మరీ పిలిపిస్తున్నారు. అయితే పల్లె జనమే నగరం నుంచి ఓట్లెయ్యడానికి వెళ్తుంటే... ఇక సిటీలో ఉండే జనం బద్దికించకుండా ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తున్న స్వచ్ఛంధ సంస్థలు కూడా ఇదే కోరుతున్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్ ట్విన్ సిటీస్ లో గతంలో 60శాతం లోపే పోలింగ్ నమోదైంది. అందువల్ల ఈసారి ఎట్టి పరిస్థితుల్లో పోలింగ్ లో సిటీ జనం భారీగా పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నారు.