Monday, March 30

నిరుద్యోగులు ప్రిపరేషన్ లోనే ఉండండి…. త్వరలోనే శుభవార్త చెబుతాం: TSPSC ఛైర్మన్

నిరుద్యోగ అభ్యర్థులు కాంపటిటేటివ్ ఎగ్జామ్స్ కోసం చేస్తున్న తమ ప్రిపరేషన్ ను కొనసాగించాలని కోరారు TSPSC ఛైర్మన్ ఘంటా చక్రపాణి. ఎవరూ అధైర్యపడొద్దనీ... త్వరలోనే మరికొన్ని పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారు. TSPSC ఏర్పాటై 5యేళ్ళయిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పడ్డ నాటి నుంచి 101 నోటిఫికేషన్ల ద్వారా 36 వేల ఉద్యోగాలకు ప్రకటనలు జారీ చేశామని ఘంటా చక్రపాణి తెలిపారు. వీటిల్లో 30 వేల కొలువులు భర్తీ చేశామన్నారు. వివిధ కోర్టు కేసుల్లో మరో 6 వేల ఉద్యోగాలు పెండింగ్ లో ఉన్నట్టు చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో 10-15యేళ్ళల్లో జరిగిన భర్తీ కంటే TSPSC ద్వారా ఐదేళ్ళల్లోనే అధికంగా పోస్టులు భర్తీ చేశామన్నారు ఛైర్మన్ ఘంటా చక్రపాణి.

TSPSC లో సిబ్బంది తక్కువగా ఉన్నారనీ... అయినా అదే స్టాఫ్ తో ఉద్యోగాల భర్తీలో ఎలాంటి పొరపాట్లు లేకుండా చూస్తున్నామన్నారు. TSPSC గ్రూప్స్ ఎగ్జామ్స్ సిలబస్ పై స్పందించిన చక్రపాణి... ప్రొఫెసర్లు, మేథావులతో కమిటీ వేసి దీన్ని తయారు చేశామన్నారు. తెలంగాణపై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తులు కమిషన్ సభ్యులుగా ఉండటం వల్లే... సమష్టి కృషితో విజయం సాధించామన్నారు. టెక్నాలజీ సాయంతో అవినీతికి తావులేకుండా కొలువుల భర్తీ ప్రక్రియ కొనసాగిందని అన్నారు TSPSC ఛైర్మన్ ఘంటా చక్రపాణి.