Monday, September 23

యువతని దూరం చేసుకుంటున్న టీఆర్ఎస్ !

తెలంగాణ వస్తే కొత్త కొలువులు వస్తాయని ఆశపడ్డ నిరుద్యోగుల ఆశలు అడియాసలే అయ్యాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగాలను గుర్తించడంలో అధికారుల వైఫల్యం దగ్గర నుంచి TSPSC వాటిని రిక్రూట్ చేయడం దాకా అన్నీ ఫెయిల్యూర్సే కనిపిస్తున్నాయి. ఫలితాలు ఆలస్యంగా రావడం, లోపభూయిష్టమైన విధానంపై కొందరు కోర్టును ఆశ్రయించడం షరా మామూలు అయింది. కనీసం కోర్టుల్లో నలుగుతున్న కేసుల విషయంలోనూ ప్రభుత్వం తరపున చేయాల్సిన కృషి జరడం లేదన్న విమర్శలూ ఉన్నాయి. దాంతో యువతకు తెలంగాణలో కొలువులు నిరాశగానే మిగులుతోంది.

కొత్తగా జిల్లాలు ఏర్పడ్డాక కూడా 8 వేలకు పైగా పోస్టులు అవసరమని గతంలో గుర్తించారు. కానీ కొత్త జిల్లాలకు సంబంధించిన ఒక్క పోస్టు కూడా ఇప్పటిదాకా భర్తీ చేయలేదు. పైగా ఇప్పుడు కొత్తగా జోనల్ సమస్య ఒకటి. వరుసగా వస్తున్న ఎన్నికలతో అయితేనేమీ... ప్రభుత్వ అధికారుల అలసత్వం వల్లేమో... మొత్తానికి జోనల్ ఫైలు ఇంకా నలుగుతోంది. దాంతో ఇప్పటికే TSPSC కి చేరిన గ్రూప్ 1, గ్రూప్ 3 పోస్టుల భర్తీ కూడా అడ్డంకిగా మారింది.

ఇక ఇప్పటికే ఎగ్జామ్స్ పూర్తి చేసుకున్న టీచర్స్ రిక్రూట్ మెంట్, FBOలు, వైద్యశాఖ ఉద్యోగాలు ఇలా ఇంకా చాలా ఉద్యోగాలు భర్తీ కాలేదు. ఇక గ్రూప్ 2 ఎగ్జామ్స్ పూర్తయి నాలుగేళ్ళు కావొస్తోంది. ఇప్పటికీ ఉద్యోగాలు రాలేదు. ఇలా ఉద్యోగాల భర్తీ అనేది తెలంగాణలో అందని ద్రాక్షే అవుతోంది. దాంతో నిరుద్యోగులు టీఆర్ఎస్ ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు. అందుకే తమ ఆగ్రహాన్ని ఇటీవల జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూపించారు. టీఆర్ఎస్ అభ్యర్థులను చిత్తుగా ఓడించారు.

ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో 16 సీట్లు టార్గెట్ పెట్టుకుంటే 9కే పరిమితం అవడం కూడా యూత్ ప్రభావం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈమధ్య కొత్తగా లక్షల మంది యూత్ తమ పేర్లు నమోదు చేసుకున్నారు. వీళ్ళంతా టీఆర్ఎస్ కి వ్యతిరేకంగా ఓట్లేశారనేది టాక్.

కరీంనగర్ లాగా చేస్తే టీఆర్ఎస్ పరిస్థితి ఏంటి ?

కరీంనగర్ లోక్ సభ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ గెలవడానికి కారణం కూడా యువతే. తమ పార్టీకి చెందిన వారు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందే టీఆర్ఎస్ లోకి జంప్ చేశారు. అయినాసరే... యువత సాయంతోనే ఒంటరి పోరు చేశారు బండి సంజయ్. గల్లీ స్థాయి కార్పొరేటర్ నుంచి ఎంపీగా ఢిల్లీ స్థాయికి ఎదిగారు. యువతే దగ్గరుండి తమ తల్లిదండ్రులతో ఓట్లు వేయించారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఎలా అంటే... బండి సంజయ్ కి ఓట్లెయ్యకపోతే... తాము అన్నం కూడా ముట్టబోమని ప్రతిజ్ఞలు చేశారు కూడా. సంజయ్ కి గతంలో రెండు సార్లు ఓడిపోవడంతో వచ్చిన సానుభూతికి యువ సైన్యం తోడైంది. వచ్చే ఎన్నికల్లో ఇదే తరహాలో యువత అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో తమ సత్తా చూపిస్తే... టీఆర్ఎస్ పరిస్థితి ఏంటన్న దానిపై చర్చ సాగుతోంది.

నిరుద్యోగ భృతితో ముందస్తు జాగ్రత్తలు

మొన్నటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో యూత్ సత్తా చూశాకే... నిరుద్యోగ భృతి అస్త్రాన్ని బయటకు తీశారు సీఎం కేసీఆర్. వీలైనంత తొందర్లో... 2,3 నెలల్లోనే నిరుద్యోగ భృతిని అమల్లోకి తేవాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే సీఎంఓ అధికారులు కూడా స్టడీ టూర్ కోసం పొరుగు రాష్ట్రాలకు బయల్దేరుతున్నారు.

కేసీఆర్ మాట నిలబెట్టుకుంటారా ?

అసెంబ్లీ ఎన్నికల ముందు నిరుద్యోగ యువతలో ఉన్న ఆగ్రహాన్ని కేసీఆర్ గుర్తించారు. అందుకే గెలిచిన వెంటనే నిర్వహించిన ప్రెస్ మీట్ లో కూడా ఉద్యోగాల భర్తీని ఆగమేఘాల మీద చేపడతామనీ... కాంగ్రెస్ హయాంలో ఉద్యోగాలే రాలేదని మండిపడ్డారు. కానీ ఆ దిశగా మాత్రం ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలు తీసుకున్నట్టు కనిపించలేదు. ప్రతియేటా జూన్ 2కి ఏదో ఒక నోటిఫికేషన్ తో యూత్ ని అట్రాక్ట్ చేస్తోంది ప్రభుత్వం. కానీ ఈసారి అలాంటి పరిస్థితి ఇప్పటిదాకా కనిపించలేదు.

మరి ఇప్పటికైనా ఉద్యోగాల భర్తీ మీద దృష్టిపెడతారా ? అటు నిరుద్యోగ భృతి, ఇటు ఉద్యోగాల భర్తీని ఒకేసారి చేపడతారా ? అన్నది చూడాలి. కొలువులపై ఎన్నో ఆశలు పెట్టుకున్న యువత నుంచి మరోసారి ఆగ్రహం వ్యక్తం చేయకముందే టీఆర్ఎస్ ప్రభుత్వం మేలుకుంటుందని ఆశిస్తున్నారు.

(pl try to share your friends, relatives )