Monday, March 30

తెలంగాణలో నోటిఫికేషన్లు ఎప్పుడిస్తరు ?

తెలంగాణలో కొలువుల నోటిఫికేషన్లు ఎప్పుడొస్తయో దేవునికే తెలియాలి. పక్క రాష్ట్రంలో లక్షలల్లో ఖాళీలు భర్తీ చేస్తున్నడు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఇంకా ఇంకా అంటూ అన్ని శాఖలల్ల ఖాళీలు ఎన్నున్నయో లెక్క చూడమంటున్నడు... ఇప్పటిదంకా లేని పోస్టులు కూడా సృష్టించి యువతకి ఉపాధి కల్పిస్తున్నడు. కానీ నీళ్ళు, నియామకాల కోసం ఏర్పడిన తెలంగాణల కొలువుల ముచ్చటే లేదు.

అప్పుడెప్పుడో ఏడాది క్రితం వరకూ 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశారు. ఇప్పుడు ప్రతి నెలా వందల మంది రిటైర్డ్ అవుతున్నరు. దానికి తోడు అప్పట్లో 10 ఉండే జిల్లాలు ఇప్పుడు 33 అయినయ్. జిల్లాలే కాదు మండలాలు, రెవెన్యూ డివిజన్లు కూడా పెరిగినయ్. దాంతో లక్షల పోస్టులు ఖాళీలు ఏర్పడినయ్. దాంతో కొలువల పండగే అని సంబురపడ్డ తెలంగాణ నిరుద్యోగులకు నిరాశే ఎదురవుతోంది. చాలా శాఖల్లో పనిచేసేందుకు ఉద్యోగులు లేక... ఉన్న వాళ్ళ మీదనే భారం పడుతోంది. దాంతో ఏ ఆఫీసుకు వెళ్ళినా జనానికి మాత్రం పనులు కావట్లేదు. అయినా సరే ... సర్కార్ కి మాత్రం తామంటే పట్టింపు లేకుండా పోతోందని మండిపడుతున్నారు నిరుద్యోగులు. రెండోసారి ఎన్నికలప్పుడు... నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పింది టీఆర్ఎస్ పార్టీ. కానీ రెండేళ్ళవుతున్నా నిరుద్యోగ భృతి కార్యక్రమం ఇంకా మొదలుపెట్టలేదు. ఇక కొత్త రాష్ట్రం వచ్చిన తర్వాత గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా వేయలేదు.. అప్పట్లో 128 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు tspsc అధికారులు ప్రకటించారు. ఆ తర్వాత జోనల్, రోస్టర్ సిస్టమ్ పేరుతో అవి పక్కన పెట్టేశారు.

గ్రూప్ 3 లో కూడా ఖాళీలు ఉన్నయ్. వాటిని జోనల్ ఇష్యూకి లింక్ పెట్టారు. 2018 డిసెంబర్ నుంచి ఇప్పటిదాకా రాష్ట్రంలోని వివిధ శాఖల్లో దాదాపు 10 వేల మంది ఉద్యోగులు రిటైర్డ్ అయ్యారు. నెలకు 500 మంది దాకా ఉద్యోగులు పదవీ విరమణ చేస్తున్నరు. అయినా వాటి భర్తీకి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. గతంలో పోస్టులు ఖాళీ అవగానే... ఉన్నతాధికారులకు సమాచారం చేరేది. అక్కడి నుంచి ప్రభుత్వం అనుమతితో సర్వీస్ కమిషన్ కు ఖాళీల సంఖ్య చేరేది. కానీ ఇప్పుడా సిస్టమ్ అమలు కావట్లేదు.

ప్రస్తుతం రెవెన్యూ, ఇరిగేషన్, వ్యవసాయం, విద్య, వైద్య ఆరోగ్య శాఖ, అటవీ, పోలీస్ శాఖల్లో ఖాళీలు చాలా ఉన్నాయి. అలాగే గురుకులాల్లో కూడా చదువులు చెప్పే టీచర్లు లేక సదువులు సక్కగ సాగడం లేదు. టీచింగ్ తో పాటు నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నయి. యూనివర్సిటీల పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. ప్రొఫెసర్ పోస్టులు భర్తీ కావట్లేదు. రాష్ట్రంలో మొత్తం 1.84 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నట్టు ఈమధ్యే కాంగ్రెస్ పార్టీ NHRC కి కంప్లయింట్ చేసింది.

Also Read:  తెలంగాణలో 1.84 లక్షల పోస్టులు ఖాళీ

అసలే పోస్టులు భర్తీ కావట్లేదని నిరుద్యోగులు వర్రీలో ఉంటే... ప్రభుత్వ ఉద్యోగుల వయో పరిమితిని పెంచే ఆలోచన చేస్తున్నది గవర్నమెంట్. దాంతో నిరుద్యోగులు ఇంకా మనాది పడుతున్నరు. జోనల్ సిస్టమ్ తొందరగా తేల్చి ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరుతున్నరు.

నోటిఫికేషన్ల భర్తీ విషయంలో అటు రాజకీయ పార్టీలు కూడా గట్టిగ స్పందించకపోవడంతో ఎవరు అండగ నిలబడతరో అని నిరుద్యోగులు ఎదురు చూస్తున్నరు.