Thursday, October 1

పంచాయతీ కార్యదర్శి పోస్టులు భర్తీ చేశారు

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 వేల పంచాయతీ కార్యదర్శుల పోస్టులు దాదాపు భర్తీ అయ్యాయి. ఇదే విషయాన్ని జాయిన్ అయిన కొందరు అభ్యర్థులు తెలంగాణ ఎగ్జామ్స్ కి సమాచారం కూడా ఇచ్చారు. 2019 ఏప్రిల్ లో జరిగిన ఎగ్జామ్స్ రాసిన వాళ్ళతో పాటు ex-servicemen కోటా నుంచి కూడా వీటిని భర్తీ చేశారు. పంచాయతీ రాజ్ కమిషనర్ ఈ 2 వేల పోస్టులను రాత పరీక్ష ద్వారా ఎంపిక చేయాలంటూ జిల్లా కలెక్టర్లకు మొదట లేఖ రాశారు. కానీ ఆ తెల్లవారి నుంచే 2019 లో ఎగ్జామ్ రాసిన అభ్యర్థుల లిస్ట్ నుంచి ఎంపిక చేసిన వారిని పిలిచి సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ నిర్వహించారు. అయితే ఈ పోస్టుల కోసం ఏదో ఆర్గనైజేషన్ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుని కలిశారనీ... రాత పరీక్ష ద్వారా కొత్త అభ్యర్థులకి ఛాన్స్ ఇస్తామని హామీ ఇచ్చినట్టు ఓ వార్త కూడా వాట్సాప్ లో చక్కర్లు కొట్టింది. కానీ ఇవేమీ లేకుండానే పంచాయతీ కార్యదర్శుల నియామకాలు జరిగిపోయాయి. పోస్టుల్లో జాయిన్ అయిన అభ్యర్థులు చెబుతున్నదాన్ని బట్టి చూస్తే 2019 ఏప్రిల్ లో ఎగ్జామ్ రాసిన అభ్యర్థుల నుంచి కనీసం జిల్లాల వారీగా 10 సార్లు సెలక్షన్స్ జరిగినట్టు తెలుస్తోంది.

ఒకసారి రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ వేశాక... పోస్టుల భర్తీ కూడా పూర్తయ్యాక మళ్ళీ అదే అదే నోటిఫికేషన్ అభ్యర్థులను రాబోయే ఖాళీల నుంచి కూడా భర్తీ చేయడం అనేది బహుశా ఎక్కడా ఉండదని అంటున్నారు నిరుద్యోగులు. రాష్ట్రంలో ఉద్యోగాల కోసం లక్షల మంది ఎదురు చూస్తుంటే కొత్తగా నోటిఫికేషన్ వేయకుండా ఇలా పాత జాబితా నుంచే పదే పదే భర్తీ చేయడంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. ఇలాంటి అవకాశం పోలీస్, ఇతర ఉద్యోగాల నోటిఫికేషన్ల నుంచి కూడా ఎందుకు ఇవ్వరన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది.