Thursday, October 1

పంచాయతీ కార్యదర్శులకి డైరెక్ట్ రిక్రూట్ మెంట్ లేదు ! కాంటాక్ట్ బేసిస్, రిటైర్డ్ అయిన వారిని తీసుకోవాలని నిర్ణయం !!

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2వేల గ్రామపంచాయతీ కార్యదర్శుల పోస్టులను కాంట్రాక్ట్ బేసిస్, రిటైర్డ్ ఉద్యోగులతో భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. మొదట రెండు వేల పోస్టుల భర్తీకి రాత పరీక్ష నిర్వహించి జిల్లా కలెక్టర్లు అభ్యర్థులను ఎంపిక చేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ కమిషనర్ రఘునందన్ జిల్లా కలెక్టర్లకి లేఖ రాశారు. ఆ లెటర్ లో క్లియర్ గా రాత పరీక్ష అనే విషయాన్ని కూడా ప్రస్తావించారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్త రిక్రూట్ మెంట్ కాకుండా కాంటాక్ట్ బేసిస్ లేదా రిటైర్డ్ వారిని నియమించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంతో నిరుద్యోగల ఆశలపై నీళ్ళు చల్లినట్టయింది. ఈ పోస్టుల భర్తీలో వయో పరిమితి గానీ, ఇతర నిబంధనలు ఏవీ లేకుండా రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు, పంచాయతీ రాజ్ వ్యవస్థలో అనుభవం ఉన్న వారికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. అంతేకాదు... 2019 ఏప్రిల్ లో 9,335 పోస్టుల రిక్రూట్ మెంట్ లో ఇంకా మిగిలిన అభ్యర్థులను కూడా తాత్కాలిక ఉద్యోగులుగా నియమించుకునేందుకు జిల్లా కలెక్టరేట్స్ లో లిస్టులు ప్రిపేర్ చేసినట్టు విశ్వసనీయ సమాచారం. నల్గొండ జిల్లా కలెక్టరేట్ లో శనివారం నాడు 2019 లో మిగిలిన అభ్యర్థులకు సంబంధించి ... సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ కూడా పూర్తి చేశారు. నాలుగైదు రోజుల్లో సమాచారం ఇస్తామని అభ్యర్థులకు తెలిపారు. మిగతా జిల్లాల సంగతి అయితే తెలియలేదు.

జేపీఎస్ పోస్టులు తాత్కాలికమే ?

జూనియర్ పంచాయతీ కార్యదర్శులను ఇకపై తాత్కాలిక ప్రాతిపదికనే నియమించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. 2019 ఏప్రిల్ లో ఈ పోస్టుల నోటిఫికేషన్ వేయకముందు ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక ప్రకటన చేశారు. మూడేళ్ళ వరకూ నెలకు రూ.15వేల రూపాయల వేతనం ఇచ్చి... ఆ తర్వాత వారి పని తీరును బట్టి పర్మినెంట్ చేస్తామని ప్రకటించారు. అయితే ఇప్పుడు 3యేళ్ళ తర్వాత రెగ్యులరైజ్ చేయడం అనే నిబంధన కూడా ఎత్తివేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.

ప్రభుత్వ నిర్ణయంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు.  ఇప్పటికే రాష్ట్రంలో నిరుద్యోగ కొరత తీవ్రంగా ఉంది.  కనీసం నిరుద్యోగ భృతి ఇస్తామని వాగ్ధానం చేసిన ప్రభుత్వం దాన్ని కూడా పక్కన పెట్టేసింది.  పైగా కరోనా లాక్ డౌన్ కారణంగా... ప్రైవేటు కాలేజీలు, స్కూళ్ళల్లో, ప్రైవేటు సంస్థల్లో చిన్నా, చితకా ఉద్యోగాలు చేసుకుంటున్న వారిలో చాలామందిని యాజమాన్యాలు తీసేశాయి.  ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం కనీసం కనికరం లేకుండా కాంటాక్ట్ బేసిస్ లేదా రిటైర్డ్ ఉద్యోగులనే గ్రామపంచాయతీ కార్యదర్శులుగా నియమించుకోవాలని నిర్ణయించడంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు.