ఖాళీల భర్తీకి సీఎం KCR మరోసారి ఆదేశాలు – మొదటి దశలో 50వేలు, ప్రమోషన్ల తర్వాత సెకండ్ ఫేజ్

ఖాళీల భర్తీకి సీఎం KCR మరోసారి ఆదేశాలు – మొదటి దశలో 50వేలు, ప్రమోషన్ల తర్వాత సెకండ్ ఫేజ్

రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి కీలకమైన కొత్త జోనల్ విధానానికి ఇటీవలే అడ్డంకులు తొలగినందున ఖాళీల భర్తీ ప్రక్రియ ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. అన్నిశాఖల్లో కలిపి దాదాపు 50,000 (యాభై వేలు) ఉద్యోగాలను మొదటి దశలో భర్తీ చేయాలని కోరారు. దీనికి సంబంధించిన ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని అధికారులను సిఎం ఆదేశించారు. ఉద్యోగులకు ప్రమోషన్లు చేపట్టడం ద్వారా ఏర్పడే పోస్టుల ఖాళీలను గుర్తించి... వాటిని రెండో దశలో భర్తీ చేయాలన్నారు.

రాష్ట్రంలో కొత్త జోన్లను ఏర్పాటు చేస్తూ... రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఈమధ్యే రాష్ట్రపతి ఆమోద ముద్ర పడింది. దాంతో రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీల భర్తీ అంశంపై ముఖ్యమంత్రి అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ‘‘గత పాలనలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అస్తవ్యస్తంగా ఉండేదనీ.... స్థానికులకు న్యాయం జరగాలనే ఉద్యమ నినాదాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం కొత్త జోనల్ వ్యవస్థను ప్రవేశపెట్టిందన్నారు సీఎం కేసీఆర్. ఎంతో శ్రమతో అత్యంత శాస్త్రీయ విధానాన్ని అనుసరించి రూపొందించిన జోనల్ వ్యవస్థకు కేంద్రం ఆమోదం లభించడంలో ఆలస్యం జరిగిందన్నారు సీఎం కేసీఆర్. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు ఇప్పుడు అన్నిరకాల అడ్డంకులు తొలగిపోయాయి. నేరుగా నింపే అవకాశాలున్న (డైరెక్టు రిక్రూట్ మెంట్) అన్ని రకాల ఉద్యోగాలు దాదాపు 50 వేల దాకా ఖాళీగా ఉన్నాయి. వాటిని ముందుగా భర్తీ చేస్తామన్నారు సీఎం. ఇప్పటికే అన్నిశాఖల్లో ప్రమోషన్ల ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. ప్రమోషన్లు చేపట్టడం ద్వారా ఏర్పడిన ఉద్యోగ ఖాళీలను కూడా గుర్తించి సెకండ్ ఫేజ్ లో భర్తీ చేయాలన్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారంతో కూడిన నివేదికను సిద్దం చేసి కేబినెట్ సమావేశానికి తీసుకురావాలని సిఎం అధికారులను ఆదేశించారు.

(ఈనెల 13న మధ్యాహ్నం 2గంటలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో కేబినెట్ సమావేశం జరగనున్నది. ఈ మీటింగ్ లో ఉద్యోగాల భర్తీపై పూర్తి క్లారిటీ రానుంది )

ఈ సమావేశంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సిఎం ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, సిఎం కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

 

Telangana Exams plus app డౌన్లోడ్ కోసం లింక్... మీకు ఇష్టమైన కోర్సుల్లో జాయిన్ అవ్వండి
https://play.google.com/store/apps/details?id=co.lynde.atvqp