Tuesday, November 13
Log In

మహా ఉద్యోగ్ మేళా నిలిపివేత, శని, ఆదివారాలు రావొద్దని పోలీసుల సూచన

ట్రేడ్ హైదరాబాద్ డాట్ కామ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరిగిన జాబ్ మేళాలో గందరగోళం తలెత్తింది. శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు మహా ఉద్యోగ్ మేళా జరుగుతుందని నిర్వాహకులు ప్రచారం చేశారు.  టీవీలు, పత్రికల్లో ప్రకటనలు ఇవ్వడంతో పాటు సోషల్ మీడియాలో విస్తృతంగా క్యాంపెయిన్ చేశారు.  360కి పైగా MNC కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొంటున్నట్టు నిర్వాహకులు చెప్పారు. 35 వేల ఉద్యోగాలు కల్పిస్తున్నట్టు తెలిపారు.

భారీ స్థాయిలో ఉద్యోగాలు ప్రకటించడంతో... దాంతో వేలమంది నిరుద్యోగులు ఆశతో ఉదయం నుంచే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కి చేరుకున్నారు. ఒక్కసారిగా వేలమంది నిరుద్యోగులు తరలిరావడంతో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ దగ్గర ఉదయం తొక్కిసలాట జరిగింది. పరిస్థితి అదుపుతప్పడంతో చివరకు పోలీసులు జోక్యం చేసుకున్నారు. ఇంటర్వ్యూలు మొదలు పెట్టిన తర్వాత నిర్వాహకుల అసలు మోసం బయటపడిందన్నారు నిరుద్యోగులు.  120కి పైగా MNC కంపెనీలు ఇంటర్వ్యూలు చేస్తాయని నిర్వాహకులు ప్రకటించగా... అక్కడ అలాంటి పరిస్థితి కనిపించలేదు. పైగా నిర్వాహకులు చెప్పినట్టు డిగ్రీ, బీటెక్ స్థాయి ఉద్యోగాలు కాకుండా... డ్రైవర్లు, సెక్యూరిటీ గార్డులు లాంటి ఉద్యోగాలకే ఇంటర్వ్యూలు నిర్వహించడంతో అభ్యర్థులు ధర్నాకి దిగారు. దాంతో పోలీసులు అప్రమత్తమై నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా... శని, ఆది వారాల్లో ఎవరూ కూడా ఉద్యోగ్ మేళా కోసం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కి రావొద్దని పోలీసులు సూచించారు.

మొన్నటి దాకా ప్రభుత్వ కొలువుల కోసం ఎదురు చూసి... కనీసం ప్రైవేటులోనైనా ఉద్యోగం సంపాదించుకుందామన్న ఆశపడ్డ నిరుద్యోగులకు తీవ్ర నిరాశే మిగిలింది. ఒక్కో అభ్యర్థి దగ్గర రూ.50ల రిజిష్ట్రేషన్ ఫీజు వసూలు చేయడం కూడా వివాదస్పదమైంది.