Wednesday, November 13

ఇస్రో నుంచి మరో ఉపగ్రహం !

షార్‌ నుంచి మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. ఈ నెల 19న రెండో ప్రయోగ వేదిక నుంచి GSLV-F‌11 రాకెట్‌ను రోదసిలోకి పంపనుంది. రాకెట్‌ అగ్రభాగాన 2.2 టన్నుల జీశాట్‌-7ఏ ఉపగ్రహ అనుసంధానం పూర్తయ్యింది. ఈ రాకెట్‌కి వివిధ పరీక్షలు నిర్వహించి ఈ నెల 17న MRR ల్యాబ్‌ సమావేశాలు నిర్వహిస్తారు. తర్వాత కౌంట్‌డౌన్‌ ప్రారంభించి 19న సాయంత్రం ఈ ప్రయోగాన్ని చేపడతారు. షార్‌ నుంచి నవంబరు 14న జీశాట్‌-29, 29న హైసిస్‌, ఈ నెల 5న ఫ్రెంచ్‌ గయానా నుంచి జీశాట్‌-11ను విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఇప్పుడు జీశాట్‌-7A ని పంపుతున్నారు. స్వల్ప వ్యవధిలోనే ఇస్రో అనేక అంతరిక్ష ప్రయోగాలను నిర్వహిస్తోంది.

ఈ ఉపగ్రహం వైమానిక రంగానికి సేవలు అందించనుంది. ఇప్పటి వరకు 13 శాటిలైట్లు ఇండియన్ ఆర్మీకి సేవలందిస్తున్నాయి. వీటిలో ఎక్కువగా కార్టోశాట్ సిరీస్ కి చెందిన రిమోట్ సెన్సింగ్ శాటిలైట్లు ఉన్నాయి. ఇవన్నీ భూమికి దగ్గరగా ఉండడం వల్ల స్కానింగ్ తో పక్కా సమాచారం అందుతోంది. మరికొన్ని జియో స్టేషనరి ఆర్బిట్ శాటిలైట్లు..రాడార్ వ్యవస్థకు సంబంధించిన శాటిలైట్లు ఉన్నాయి. గతంలో జి-శాట్-7 ను 2013 సెప్టెంబర్-29 న ప్రయోగించింది. ఈ జి-శాట్ 7A ప్రయోగంతో ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్స్ కు, దేశ రక్షణ, నావిగేషన్ తో పాటు కమ్యునికేషన్ వ్యవస్థకి ఉపయోగపడనుంది. డ్రోన్ ఆపరేషన్ ను కూడా బలోపేతం చేయనుంది. దాదాపు 500 నుంచి 800 కోట్ల వ్యయంతో జి- శాట్7A తయారు చేస్తున్నారు. ఈ ఉపగ్రహం తొమ్మిదేళ్ళ పాటు సేవలు అందించనుంది.