Saturday, August 15

ఆన్ లైన్ క్లాసులు పెడితే యాక్షన్ !

హైదరాబాద్ లో నిబంధనలకు విరుద్ధంగా ఆన్ లైన్ క్లాసులు నడుపుతున్న ప్రైవేటు విద్యాసంస్థలపై చర్యలు తీసుకునేందుకు విద్యాశాఖ సిద్ధమైంది. జీవో నెంబర్. 46ను ఉల్లంఘించిన దాదాపు 15 స్కూళ్ళకి విద్యాశాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. విద్యాశాఖ నోటీసులకు జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్, గీతాంజలి స్కూళ్ళు స్పందించాయి. హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి వెంకట నరసమ్మ ఆదేశాలతో రికార్డులను సమర్పించాయి ఈ రెండు స్కూల్స్ యాజమాన్యాలు. రికార్డులు పరిశీలించిన తరువాత స్కూళ్ళపై యాక్షన్ తీసుకుంటామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. గురువారం హైదరాబాద్ లో మరికొన్ని స్కూళ్ళల్లోనూ తనిఖీలు జరిగినట్టు తెలుస్తోంది. ఆన్ లైన్ క్లాసులతో పాటు... ఇష్టమొచ్చినట్టుగా ఫీజులు వసూలు చేస్తున్నారన్న తల్లిదండ్రుల ఫిర్యాదులపైనా అధికారులు స్పందించారు.  ఇప్పటికే మేడ్చల్, కొండాపూర్, బాలాపూర్, ఎల్బీ నగర్, దిల్ సుఖ్ నగర్, అల్వాల్, మేడిపల్లి, చింతల్, నాచారం, కూకట్ పల్లి, తార్నాక, అమీర్ పేట, హిమాయత్ నగర్, వికారాబాద్ లోని అనేక స్కూళ్ళకి విద్యాశాఖ అధికారులు నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి ఆన్ లైన్ క్లాసులు నిర్వహించినా చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.