కేంద్ర ప్రభుత్వ స్కాలర్ షిప్స్

విద్యలో మంచి మార్కులతో రాణిస్తున్నా ఉన్నత చదువులకు డబ్బులు లేక ఇబ్బందులు పడే విద్యార్థులు దేశంలో ఎందరో ఉన్నారు. వారి చదువులు మధ్యలో ఆగిపోకూడదన్న ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా స్కాలర్ షిప్ స్కీమ్ ను అమలు చేస్తోంది.

ఇంటర్ సెకండియర్ (10+2) పూర్తి చేసుకున్న ప్రతిభ గల విద్యార్థులకు వీటిని మానవ వనరుల మంత్రిత్వ శాఖ మంజూరు చేస్తోంది. ప్రతి యేటా 82 వేల మందికి కొత్తగా స్కాలర్ షిప్స్ ఇస్తోంది. ఇందులో 41 వేలు మగ పిల్లలకు, 42 వేలు ఆడపిల్లలకు కేటాయిస్తారు. వాళ్ళు కాలేజీలు, యూనివర్సిటీల్లో గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువులు కొనసాగించడానికి లేదా ప్రొఫెషనల్ కోర్సులైన మెడికల్, ఇంజనీరింగ్ పూర్తి చేయడానికి మంజూరు చేస్తారు. రాష్ట్ర జనాభాలో 18-25 యేళ్ళ మధ్యలో చదువుకుంటున్న వారి నిష్పత్తి ఆధారంగా ఆయా రాష్ట్ర విద్యార్థులకు ఈ స్కాలర్ షిప్స్ మంజూరు అవుతాయి. ఇందులో ఆయా రాష్ట్రాల బోర్డుల నుంచి ఇంటర్ (10+2) పూర్తి చేసుకున్న విద్యార్థుల్లో సైన్స్, కామర్స్, హ్యుమనిటీస్ కు 3:2:1 నిష్పత్తిలో స్కాలర్ షిప్స్ ఇస్తారు. ఇంటర్మీడియట్ లేదా 10+2 పూర్తి చేసుకున్న విద్యార్థుల తల్లిదండ్రుల ఆదాయం ఏడాదికి రూ.6 లక్షలకు మించకుండా ఉన్న వారికి మాత్రమే అవకాశం ఉంటుంది. కరెస్పాండెన్స్,డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో చదివుతున్న వారికి ఈ స్కీమ్ వర్తించదు. రెగ్యులర్ గా కాలేజీల్లో చదివే విద్యార్థులకు మాత్రమే కేంద్ర ప్రభుత్వ స్కాలర్ షిప్ స్కీమ్ మంజూరు చేస్తుంది. అంతేకాదు మరే ఇతర సంస్థల నుంచి ఉపకార వేతనం పొందుతున్నా ఈ స్కీమ్ కింద మళ్ళీ మంజూరు చేయరు. జనరల్ (OC) అభ్యర్థులతో పాటు రిజర్వుడ్ కేటగిరీ అభ్యర్థులు కూడా నేషనల్ స్కాలర్ షిప్స్ స్కీమ్ కు అర్హులే.

గ్రాడ్యుయేషన్ లెవల్ లో కాలేజీలు లేదా యూనివర్సిటీల్లో చదివే స్టూడెంట్స్ కి అయితే మొదటి మూడేళ్ళు నెలకు వెయ్యి చొప్పున ఇస్తారు. అదే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే నెలకు రెండు వేల రూపాయల చొప్పున మంజూరు చేస్తారు. ప్రొఫెషనల్ కోర్సుల విద్యార్థులకు 4th, 5th year లో నెలకు రెండు వేల చొప్పున ఇస్తారు. అయితే ఏడాదిలో 10 నెలలకు మాత్రమే స్కాలర్ షిప్స్ మంజూరవుతాయి. నిబంధనల మేరకు ప్రతి యేడాది వీటిని రెన్యువల్ చేస్తారు. స్కాలర్ షిప్స్ కాలేజీలు లేదా యూనివర్సిటీల ఖాతాలకు కాకుండా నేరుగా విద్యార్థి ఖాతాకు మాత్రమే బదిలీ చేస్తారు. ఆధార్ కార్డు అనుసంధానం చేసిన విద్యార్థుల బ్యాంకు ఖాతాలో నేరుగా స్కాలర్ షిప్ మొత్తాన్ని జమ చేస్తారు.

ఇతర గైడ్ లైన్స్ కోసం చూడండి : http://mhrd.gov.in/sites/upload_files/mhrd/files/upload_document/Guidelines_CSS_Scholarship.pdf